Andhra PradeshNewsNews Alert

తిరుమలలో.. రోజా తీరుపై భక్తుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మంత్రులు తిరుమలలో నడుచుకుంటున్న విధానం ఈ మధ్య వరుస వివాదాలకు దారి తీస్తుంది. కలియుగ దైవం కొలువైన తిరుమలలో వీరు చేస్తున్న పనులు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఉషాశ్రీ చరణ్,అప్పలరాజు తిరుమలలో చేసిన నిర్వాకాలు ఇప్పటికీ ప్రజల నోటిలో నానుతూనే ఉన్నాయి. మళ్లీ ఇప్పడు రోజా చేసిన పనికి తిరుమలలోని భక్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏపీ మంత్రులందరూ..నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మంత్రి రోజా ఈ రోజు తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజాతో పాటు కేవలం 10 మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఉంది. కానీ ఆమె వెంట 30 మంది లోపలికి వెళ్ళారు.  అయితే అక్కడి సిబ్బంది వీరిలో  20 మందికి అనుమతిలేదని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా.. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ 20 మందికి బ్రేక్ దర్శనం కల్పించారు. అంతేకాకుండా ఆ 20 మంది బ్రేక్ దర్శనాలు పూర్తయ్యే వరకు అంటే దాదాపు 2 గంటల పాటు రోజా అక్కడే  వేచి ఉండడం  ఇప్పడు వివాదాస్పదమవుతోంది. అసలే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలను కూడా టీటీడీ అధికారులు ఆపేశారు. ఇటువంటి పరిస్థితులలో రోజా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంపై తిరుమలలోని భక్తులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.