‘ట్రంప్‌కు నోబెల్ ఇచ్చేశా..!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం అందజేశానంటూ వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాదో సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ, భవిష్యత్తు కోసం ట్రంప్ చేసిన కృషికి గుర్తుగానే ఈ బహుమతిని వైట్ హౌస్ లో అందజేశానని ఆమె తెలిపారు. ట్రంప్ గొప్ప నాయకుడని, ప్రజలు ఆయనను నమ్మవచ్చని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. ట్రంప్ ఈ పురస్కారాన్ని అధికారికంగా స్వీకరించారా లేదా అన్నది స్పష్టత రాలేదు. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇలా ఇతరులకు బదిలీ చేయడం సాధ్యం కాదని నోబెల్ సంస్థ స్పష్టం చేసింది.
గతేడాది నోబెల్ శాంతి పురస్కారం చుట్టూ తీవ్ర చర్చ జరిగింది. ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ స్వయంగా నోబెల్‌కు అర్హుడినని ప్రచారం చేసుకున్నా, పురస్కారం మాత్రం దక్కలేదు. ఆ పురస్కారం వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాదోకు లభించింది. అప్పటి నుంచే ఆ బహుమతి ట్రంప్‌కే ఇవ్వాలంటూ ఆమె వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో అరెస్టు తర్వాత నోబెల్‌ను ట్రంప్‌కు అందజేస్తానని మచాదో ప్రకటించారు.
నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో మచాదో అండర్‌గ్రౌండ్‌లో ఉండటంతో బహుమతి ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయారు. ఆమె బయటకు వస్తే అరెస్టు చేస్తామని మదురో ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా సహాయంతో దేశం విడిచినట్లు సమాచారం. ఆ పరిణామాల నెల రోజులకే వెనెజువెలా అధ్యక్షుడు మదురో అరెస్టు కావడం గమనార్హం. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడినందుకే 2025 నోబెల్ శాంతి పురస్కారం మచాదోకు లభించడం గమనార్హం.

