ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టు తెస్తా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రూపురేఖలను మార్చే విధంగా, జిల్లాకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టును తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం శుక్రవారం పర్యటించారు. రూ. 386.46 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని తెలిపారు. విమానాశ్రయం పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానిస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసమే తాను ప్రధానిని కలుస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయ విమర్శలకు తావులేదని స్పష్టం చేశారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్యను చేరువ చేసేందుకు బాసర ఐఐఐటీలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. నిర్మల్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో పాటు, గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర అభివృద్ధికి రూ. 22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, అభివృద్ధిని ఆపబోమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

