home page sliderHome Page SliderInternational

రైలుపై పడిన భారీ క్రేన్.. 22 మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుకు చెందిన ఒక భారీ క్రేన్ కూలి రైలుపై పడిన ఘటన బుధవారం ఉదయం సంభవించింది. ఇప్పటివరకూ ఈ దుర్ఘటనలో 22 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో రైలులో సుమారు 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు థాయ్‌లాండ్ రవాణా మంత్రి పిపట్ రాట్చకిట్‌ ప్రకర్ వెల్లడించారు.
బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు వెళ్తున్న ప్రయాణికుల రైలు థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లా గుండా రైలు వెళ్తుండగా , అక్కడ కొనసాగుతున్న హైస్పీడ్ రైల్వే నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ అకస్మాత్తుగా రైలు బోగీలపై కూలిపడింది. దీంతో బోగీలు పట్టాలు తప్పడంతో పాటు కొంతమేర మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రెస్క్యూ బృందాలు గ్యాస్ కట్టర్లతో ఇనుప భాగాలను కట్ చేసి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీస్తున్నాయి. అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనాస్థలిలో మోహరించారు. కూలిపోయిన క్రేన్ చైనా–థాయ్‌లాండ్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై థాయ్ లాండ్ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.