తుంగతుర్తిలో అభివృద్ధి శూన్యం
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సారెస్పీ రెండో దశ కాలువలు, రిజర్వాయర్ల పరిస్థితి దారుణంగా తయారైందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ‘జాగృతి జనం బాట’లో భాగంగా శనివారం ఆమె తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ కాలువలు, రుద్రమ చెరువు,చాల కాలం నుంచి అసంపూర్తిగా ఉన్న 100 పడకల ఆసుపత్రి భవనాన్ని ఆమె పరిశీలించారు. తర్వాత అమరుడు మారోజు వీరన్న విగ్రహానికి నివాళులర్పించి విలేఖరులతో మాట్లాడారు.
గత పన్నెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి శూన్యమని కవిత ఎద్దేవా చేశారు. పంట కాల్వల నిర్వహణ కోసం అటు బీఆర్ఎస్ కానీ, ఇటు అధికార కాంగ్రెస్ కానీ ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. “కాలువల్లో కంప చెట్లు పెరిగి నీరు పారే పరిస్థితి లేదు. డిస్ట్రిబ్యూటరీ కాలువను పూర్తి చేయకపోవడం వల్లే రుద్రమ చెరువులోకి గోదావరి నీళ్లు రావడం లేదు. గత బీఆర్ఎస్ పాలకులు దీనిని రిజర్వాయర్ చేస్తామని మాట ఇచ్చి తప్పారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టూరిస్ట్ ప్లేస్ చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు” అని ఆమె విమర్శించారు.
తుంగతుర్తిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు మారుస్తూ 2018లో రెండుసార్లు శంకుస్థాపనలు జరిగినా, నేటికీ భవనం పూర్తి కాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆరు మండలాల ప్రజలు మెరుగైన వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు. తక్షణమే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బండి యాదగిరి వంటి మహనీయులు పుట్టిన తుంగతుర్తి గడ్డ విప్లవోద్యమాలకు పురిటిగడ్డ అని కవిత కొనియాడారు. సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో ఎక్కడ అడ్డంకులు ఏర్పడ్డాయో తెలుసుకోవడానికే తాము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేలా రిజర్వాయర్లు కట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి, రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

