రాష్ట్రంలో బూతులే రాజ్యమేలుతున్నాయి
తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని, నేతల మధ్య కేవలం అసభ్య పదజాలంతో కూడిన దూషణలే రాజ్యమేలుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై శుక్రవారం ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడేవారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి బూతులు తిట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రజా చర్చను పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. నేతలు ఇలా తిట్టుకుంటున్నారంటేనే వారు పాలనలో విఫలమైనట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. భాషా సంస్కృతిపై ఉపన్యాసాలు ఇచ్చే పార్టీలే నేడు రాజ్యాంగ వేదికల నుండి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు, రైతులకు భరోసా, మరియు మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 2014 నుండి రాష్ట్రంలో కేవలం ‘గట్టర్ పాలిటిక్స్’ మాత్రమే నడుస్తున్నాయని, ప్రజలు ఆశించిన జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు.

