Home Page Sliderhome page sliderNationalSports

బౌలర్‌లే ముంచారు…షమీ కోసం అభిమానుల డిమాండ్

రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ పరాజయం ఎదుర్కొంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచినప్పటికీ, భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ వంటి అనుభవం తక్కువ బౌలర్లపై ఆధారపడటం అభిమానులకు నచ్చలేదు. హర్షిత్ రాణా 70 పరుగులు, ప్రసిద్ కృష్ణ 85 పరుగులు ఇచ్చినా ఒక్కో వికెట్ కూడా తీసుకోలేకపోయారు. వీరిద్దరూ పేస్ బౌలింగ్‌ను సరిగ్గా నియంత్రించలేకపోవడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆగ్రసివ్‌గా ఆడి మ్యాచ్‌ను సులభంగా గెలిచారు.
మొదటి వన్డేలోనూ భారత్ ఓటమి అంచు దాకా వెళ్లి చివరికి గెలిచింది. ఆ మ్యాచ్‌ను చూస్తేనే బౌలింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో అదే తప్పిదం పునరావృతం కావడంతో అభిమానులు బీసీసీఐ ఎంపికలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీ పేరు ఒక్కసారిగా తిరిగి చర్చకు వచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు సాధించి టోర్నమెంట్‌లో అత్యంత ప్రభావవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహిస్తున్నారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. ఇంత స్థాయి ఉన్న బౌలర్‌ను పక్కనబెట్టడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శిస్తున్నారు.
మొహమ్మద్ సిరాజ్‌కి కూడా అవకాశం ఇవ్వాలని, అనుభవజ్ఞులైన బౌలర్లను విస్మరించడం వల్లే భారత్ వరుసగా సమస్యలు ఎదుర్కొంటోందని అభిమానులు అంటున్నారు. యువ బౌలర్లకు అవకాశం ఇవ్వడం తప్పు కాదుగానీ, పెద్ద మ్యాచ్‌ల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను విస్మరించడం భారత జట్టుకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.