అమెరికాలో భారీ లేఆఫ్‌లు :నెలలో 1.53 లక్షల ఉద్యోగాలు మాయం
ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఏడాదిగా గడ్డుకాలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్ నెలలోనే 1,53,074 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇది గత రెండు దశాబ్దాల్లో ఒకే నెలలో నమోదైన అత్యధిక సంఖ్యగా గుర్తించబడింది. ఈ వివరాలను అమెరికాలోని ప్రముఖ ఉద్యోగ విశ్లేషణ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ప్రభావం, డిజిటల్ ఆపరేషనల్ గ్లోబల్ ఎకానమీలో మార్పులు, నిర్వహణ ఖర్చులను తగ్గించే చర్యలు, మార్కెట్ మందగమనం, పెట్టుబడిదారుల ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.
గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది అక్టోబర్ నెలలో లేఆఫ్‌లు 175% పెరిగాయి. 2025 జనవరి నుండి అక్టోబర్ వరకు మొత్తం 10.99 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది ఇదే కాలంలో 6.64 లక్షల ఉద్యోగ కోతలు మాత్రమే జరిగాయి. దాంతో, లేఆఫ్‌ల సంఖ్యలో 65శాతం వృద్ధి నమోదైనట్లు ఈ నివేదికలో తెలుస్తోంది.
“ఏఐ సాంకేతికత పనితీరు పెంచగలదనేది నిజం. కానీ కంపెనీలు లాభాల కోసం ఉద్యోగాలను కోత పెట్టడం సమాజపరంగా ఆందోళనకరం.ఇలాంటి పరిస్థితుల్లో రీస్కిల్లింగ్, ఏఐ సంబంధిత శిక్షణ ఉద్యోగులకు తప్పనిసరి అవుతుంది.” అని ఉద్యోగ నిపుణులు పేర్కొంటున్నారు. ఏఐ ఆధారిత భవిష్యత్తు యుగంలో, ఉద్యోగ భద్రత కంటే నైపుణ్యమే కీలకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

