Breaking NewsHome Page Sliderhome page sliderInternational

బ్రిటన్ లో దారుణం – జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం

బ్రిటన్ లో మరోసారి జాత్యహంకారంతో మానవత్వానికి మాయని మచ్చగా మారింది. బ్రిటన్‌లో భారతీయ యువతులపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు అక్కడి ప్రజలను, భారతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌లో భారత్‌కు చెందిన 20 ఏళ్ల పంజాబీ యువతిపై ఓ శ్వేతజాతీయుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన యూకే కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం వాల్సల్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాధితురాలు నివాసం ఉంటున్న ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. సంఘటన తర్వాత యువతి తీవ్ర మానసిక స్థితిలో ఉండడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, దుండగుడు 30 ఏళ్ల వయస్సున్న శ్వేతజాతీయుడని గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
సిక్కు ఫెడరేషన్‌ యూకే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బ్రిటన్‌లో సిక్కు మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. గత నెలలో ఓల్డ్‌బరీ ప్రాంతంలో కూడా ఓ సిక్కు యువతిపై ఇలాంటి లైంగిక దాడి జరిగినట్లు ప్రస్తావించింది. ఇది యాదృచ్ఛికం కాదని, సిక్కు , భారతీయ సమాజంపై లక్ష్యపూర్వక దాడులుగా భావించాలని వ్యాఖ్యానించింది.
ఈ సంఘటనలపై యూకే రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. వివక్ష, జాత్యహంకారంపై మరింత కఠిన చట్టాలు అవసరమని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. లండన్‌ మేయర్‌, పలు మానవ హక్కుల సంస్థలు కూడా బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ ఇచ్చాయి.
భారత విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. “ఇలాంటి దాడులు మానవత్వాన్ని దాటిపోయిన క్రూరత్వం ” అంటూ భారత హైకమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన యువతుల భద్రత కోసం యూకే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.