జూబ్లీహిల్స్‌లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం – కేటీఆర్ కీలక హామీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) ముస్లిం సమాజానికి ముఖ్య హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం కేటాయించే బాధ్యతను తనదిగా ప్రకటించారు.
“ఈ ప్రభుత్వంతో పోరాడి అయినా ఆ స్థలం ఇప్పిస్తా. ఇవ్వకపోతే, రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే, మొదటి వారంలోనే జీవో తీసుకువచ్చి స్థలం కేటాయిస్తాం,” అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అలాగే ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే, ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి అయినా శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “కేసీఆర్ హయాంలో మైనారిటీలకు గౌరవం ఇచ్చాం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల కోసం ఇప్పటికే 125 ఎకరాల భూమిని శ్మశాన వాటికలుగా కేటాయించాం,” అని గుర్తు చేశారు.