ట్రంప్ పై ప్రశంసల జల్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో భాగంగా, మొదటి దశలో రెండు సంవత్సరాలుగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెలీ బందీలు స్వదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకాలం ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈసారి ఆయనను అభినందించారు. గాజా ఒప్పందాన్ని స్వాగతిస్తూ, ఆ ఒప్పందం కుదిరేలా మార్గం సుగమం చేయడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. బందీల విడుదల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, అమెరికాతో పాటు ప్రపంచ మద్దతుతో మధ్యప్రాచ్యం శాంతి మార్గంలో అడుగులు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ట్రంప్‌ను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ, హమాస్ దాడితో ప్రారంభమైన ఘర్షణలో జరిగిన మానవ నష్టం బాధాకరం. ఇప్పుడు కాల్పుల విరమణ కుదరడం, 20 మంది బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం చేరడం గొప్ప విషయాలని, ఈ ఒప్పందం కుదిరేందుకు కృషి చేసిన ట్రంప్, ఆయన బృందం, ఖతార్, ఇతర దేశాలు ప్రశంసనీయమైనవని , అన్నారు.
ఈ పొగడ్తలపై అధ్యక్షుడు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. “ఇది చాలా మంచి విషయం. వారు నిజాన్ని చెబుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, గాజా శాంతి ఒప్పందానికి అధికారిక ముద్ర పడింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఈజిప్ట్, ఖతార్, తుర్కియేల అధ్యక్షులు కూడా సంతకాలు చేశారు. డజన్ల సంఖ్యలో ఉన్న ప్రపంచ అగ్ర నేతల సమక్షంలో ఈ చారిత్రాత్మక సంతకాలు ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగాయి.