కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలపై నిషేధం
బెంగళూరు: కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సమావేశాలపై రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు మరియు పబ్లిక్ ప్రదేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశించారు.
మంత్రి ప్రియాంక్ ఖర్గే పంపిన లేఖకు స్పందించిన సిద్దరామయ్య, తమిళనాడులో అమల్లో ఉన్న విధానాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని సూచించారు. ప్రియాంక్ ఖర్గే తన లేఖలో ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థులను మతం పేరిట ప్రభావితం చేస్తోందని, వారి మనసులను కలుషితం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
“బీజేపీ నేతల పిల్లలు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనరని?” అంటూ ఖర్గే ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు ఇకపై అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం రాష్ట్రంలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీజేపీ నేతలు ఈ చర్యను ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పేర్కొంటుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది విద్యా వాతావరణం పరిరక్షణకు అవసరమని సమర్థిస్తున్నారు.