నోబెల్ శాంతి బహుమతి రాకపోయినా శాంతి కోసం కృషి చేస్తా
ప్రపంచ శాంతికి చిహ్నంగా తనకు తానే ప్రకటించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి అందుకోలేకపోయినా, తాను ఎప్పటికీ శాంతి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. బహుమతి దక్కకపోవడం నన్ను నిరుత్సాహపరచదు. నా లక్ష్యం బహుమతి కాదు, ప్రపంచంలో శాంతి నెలకొల్పడమే అని ఆయన తెలిపారు.ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, గాజాలో బందీల విడుదల వంటి పరిణామాల మధ్య ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గాజా శాంతి సదస్సులో పాల్గొనేందుకు ఈజిప్ట్‌కు బయలుదేరే ముందు ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడిన ఆయన,“యుద్ధాలను ఆపడం అంటే దౌత్యం, ధైర్యం రెండూ కావాలి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక ప్రపంచ సంక్షోభాలు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు నా దృష్టి మరో అగ్నిపర్వతంపై ఉంది. పాక్–అఫ్గాన్ ఘర్షణలపై, అన్నారు.
ఇటీవల పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ట్రంప్ ఈ పరిస్థితిని “ప్రాంతీయ శాంతికి ముప్పు”గా పేర్కొంటూ, అవసరమైతే అమెరికా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. “ఆ ప్రాంతం మరో ఉక్రెయిన్ కావద్దు. మేము జోక్యం చేసుకోవాల్సి వస్తే, అది శాంతి కోసం మాత్రమే అవుతుంది” అని ఆయన అన్నారు.
తాను నోబెల్ శాంతి బహుమతి పొందకపోవడం వెనుక రాజకీయ ప్రభావాలు ఉన్నాయని ట్రంప్ పరోక్షంగా సూచించారు. అయినా తాను వెనుకడగు వేయనని స్పష్టం చేశారు. నా చర్యలతోనే ప్రపంచం నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుంది. బహుమతులు రావొచ్చు, పోవొచ్చు. కానీ శాంతి కోసం నేను ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాను, అని ఆయన ఉద్ఘాటించారు.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ, గాజా బందీల విడుదల తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ఆయన దృష్టి పాక్–అఫ్గాన్ సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్రీకృతం కావడం, అంతర్జాతీయ వేదికపై మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందనే సంకేతాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.