పేరు మార్చుకుని మరీ గిన్నిస్ రికార్డు
జీవితంలో ఏదో సాధించి తన పేరును సార్ధకత చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవు కొత్తగా ఏదైనా సాధించి ఈ ప్రపంచ చరిత్రలో తన పేరు శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాడు.దానికీగాను వినూత్నంగా ఆలోచన చేసి , చివరికి అది ఇది ఎందుకు, తన పేరుతోనే గిన్నిస్ రికార్డు కెక్కాడు.
న్యూజిలాండ్ కు చెందిన లారెన్స్ వాట్ కిన్స్ అసాధారణమైన రీతిలో తన పేరునే గిన్నిస్ రికార్డుకు ప్రయోగించి చరిత్ర సృష్టించాడు. 2,253 పదాలను ఉపయోగించి , ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 1965లో జన్మించిన లారెన్స్, 1990లో తన పేరును భారీ ఎత్తున మారుస్తానని నిర్ణయించుకున్నారు. మొదట స్థానిక కోర్టులో దరఖాస్తు చేసుకున్నా, రిజిస్ట్రార్ జనరల్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. చివరికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన తన ఆశయాన్ని నెరవేర్చారు.
లారెన్స్ ప్రస్తుతం తన నివాస సమీపంలో లైబ్రరీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి గిన్నిస్ రికార్డుల పట్ల ఆసక్తి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు . “నేను కూడా ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాలని ఎప్పుడో అనుకున్నా. చివరకు అది నా పేరుతో సాధ్యమైంది” అంటూ లారెన్స్ వాట్ కిన్స్ ఆనందంతో పంచుకున్నారు.
మరోవైపు , గిన్నిస్ బుక్ రికార్డు కోసం తన పేరును పొడిగించే క్రమంలో స్నేహితులు, సహచరులు సహకరించారని, టైపింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనుల్లో వారంతా కీలక పాత్ర పోషించారని లారెన్స్ తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా చూపించాలన్నదే అసలైన ఉద్దేశమని లారెన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో లారెన్స్ వాట్ కిన్స్ అనుసరించిన మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.