Breaking NewsBusinesshome page sliderHome Page SliderNationalviral

చరిత్ర సృష్టిస్తున్న పసిడి ధరలు

బంగారం ధరలు ప్రతీరోజూ అందనంత ఎత్తుకి ఎదుగుతూ చరిత్ర సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే 10 గ్రాముల ధర రూ. లక్ష దాటిన పసిడి ధర ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోతోంది. తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకుని అందరినీ బెంబేలెత్తిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్, ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్ పెంచుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,780 వద్ద ఉంటే.. 22 క్యారెట్ల పసిడి రూ.1,12,900 పలికింది. అటు వెండి సైతం కిలో రూ.1.56 లక్షలు దాటింది. అంతర్జాతీయ విపణిలో గోల్డ్ ఔన్సు 4034 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి ఔన్సు 48.62 డాలర్ల వద్ద అమ్మకం జరుగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.79గా ఉంది.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంపై టారిఫ్ ల ప్రభావం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు కొనుగోళ్ల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పుత్తడి వైపు పెట్టుబడులు మళ్లడమే దీనికి కారణం. దాదాపు రెండేళ్లక్రితం ఔన్సు బంగారం ధర 2 వేల డాలర్ల దిగువనే ఉండేది. అలాంటిది ఈ ఒక్క క్యాలెండర్ సంవత్సరంలోనే దాదాపు 50 శాతం మేర పెరగడంతో పసిడి కొనుగోళ్లకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. పండగ సీజన్లో వ్యాపారాలు తగ్గడంతో ఆభరణ వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.