నిరుద్యోగుల కోసం కవిత దీక్ష
గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరుద్యోగులకు మద్దతుగా బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. విద్యార్థుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కొంత మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్ 1 పెట్టారా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో గ్రూప్ 1 పెట్టలేకపోవడం దారుణమేనని , నిరుద్యోగులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
పరీక్ష రాసిన విద్యార్థులు.. ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు రాసిన పేపర్లు బయట పెట్టమని అడుగుతున్నారన్నారు. 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ను స్వయంగా కలుస్తామని…. వ్యవస్థ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తే అధికారంలో నుంచి తప్పించి బయట పడేస్తారని హెచ్చరించారు. నేడు ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ మీటింగ్ ఉందన్నారు. ప్రజా ఆగ్రహానికి గురికావొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగాలు వచ్చిన వారిపై తమకు కోపం లేదని.. అక్రమంగా తెచ్చుకున్న వారిపైనే కోపమని కవిత స్పష్టం చేశారు.