home page sliderHome Page SliderInternationalNewsPoliticsviral

ఇజ్రాయెల్ కు అమెరికా భారీ సైనిక సాయం


హమాస్ – ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్న దశలో ఇజ్రాయెల్ కు అమెరికా భారీ సైనిక సాయం అందించింది. రెండేళ్ల కిందట గాజా పైన ఇజ్రాయెల్ సైనిక చర్యలను చేపట్టింది. అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఇప్పటి వరకు 21.7 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయం అందిందని తాజా నివేదికలో వెల్లడైంది. అమెరికా మద్దతుతోనే హమాస్‌పై రెండేళ్లపాటు ఇజ్రాయెల్ నిర్విరామంగా యుద్ధం చేయగలిగిందని నివేదిక పేర్కొంది. జో బైడెన్ హయాంలో 17.9 బిలియన్ డాలర్లు, ట్రంప్ పాలనలో 3.8 బిలియన్ డాలర్ల సాయం ఇజ్రాయెల్‌కు అందినట్లు తెలుస్తోంది. యెమెన్‌లోని హూతీ రెబల్స్‌, ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడుల కోసం ఆ నిధులను వెచ్చిందని తెలిపింది.

2023 అక్టోబరు 7న హమాస్ చేపట్టిన మెరుపుదాడిలో వెయ్యికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రతిగా నెతన్యాహు సర్కార్ హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై విస్తృత దాడులు ప్రారంభించింది. ఇందులో వేలాదిమంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇక యుద్ధానికి ముగింపు దశ సమీపించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గాజాతో ప్రారంభమైన యుద్ధం అక్కడే ముగుస్తుందన్నారు. అయితే, “హమాస్‌ ఇంకా పూర్తిగా నాశనం కాలేదు” అంటూ వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరోక్ష చర్చలు ప్రస్తుతం ఈజిప్టులో జరుగుతున్నాయి. ఖలీల్ అల్ హయ్యా నేతృత్వంలోని హమాస్ బృందం, రాన్ డెర్మర్ నాయకత్వంలోని ఇజ్రాయెల్ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు కొనసాగుతున్నాయి.
బందీల విడుదల, కాల్పుల విరమణ వంటి అంశాల్లో తొలి దశలో అంగీకారం కుదిరినట్టు సమాచారం.