ఆ తీర్పు ముందే ఊహించాం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై దాఖలైన పిటిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టులో ఇప్పటికే కేసు విచారణలో ఉండగా, ఇక్కడకు ఎందుకు వచ్చారని ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది.
ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తీవ్రంగా స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించామని హైకోర్టులో విచారణ కొనసాగుతుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని అందరికి తెలుసునని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తమ విజయంగా సంబరాలు చేసుకోవడం ఆశ్యర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు . ఢిల్లీలో ఏదో సాధించినట్టు ఆర్భాటం చేయడం తప్ప మంత్రులు ఏమీ సాధించలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పూర్తిగా టెక్నికల్ ఇష్యూ మాత్రమేనని రామ్‌చందర్ రావు స్పష్టం చేశారు.