Home Page SliderNationalSpiritualTrending Todayviral

జమ్మి ఆకులను ‘బంగారం’ అని ఎందుకు పిలుస్తారు?

హిందువులు దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తుంటారు. ఈ జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం మహారాష్ట్ర , తెలంగాణలో బలంగా ఉంది. ఈ ఆకులను బంగారం అంటారు. ఇలా పంచుకోవడాన్ని “బంగారాన్ని పంచుకోవడం” అని పిలుస్తారు. జమ్మి ఆకులు నిజమైన బంగారం వలె ఎంతో పవిత్రమైనవని నమ్ముతారు. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, సంపద, శ్రేయస్సు పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రజలు దసరా రోజున జమ్మి ఆకులను ఇంటికి తీసుకువచ్చి ఇంట్లోని పూజ గదిలో లేదా ఎక్కడైనా భద్రంగా ఉంచుతారు. దసరా లేదా విజయదశమి హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజునే రాముడు రావణుడిని వధించి, ధర్మాన్ని రక్షించాడని, లోక కంటకుడైన మహిషాసురుడుని, దుర్గాదేవి సంహరించి లోక కళ్యాణం చేసిన రోజు అని నమ్ముతారు. ఈ రోజు రావణ దహనంతో పాటు ప్రత్యేక సంప్రదాయం జమ్మి చెట్టును పూజిస్తారు. జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా, పురాణాలు, జ్యోతిషశాస్త్రం అనే మూడు అంశాలలో అత్యంత శక్తివంతమైనది. ఫలవంతమైనదిగా నమ్ముతారు. ఈ నమ్మకం మహాభారత కాలం నాటిది. పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు వారు తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టులో దాచిపెట్టారు. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత వారు తిరిగి వచ్చి, ఆ ఆయుధాలతో యుద్ధంలో విజయం సాధించారు. దీని ఫలితంగా జమ్మి చెట్టు శక్తికి, విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. అప్పటి నుంచి దసరా రోజున జమ్మి చెట్టుని పూజించి ఆయుధ పూజ చేసే సంప్రదాయం మొదలైంది. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ మాత్రమే కాదు.. జమ్మి చెట్టుని పూజించడం వల్ల శత్రువులపై విజయం, శని దోషం నుంచి ఉపశమనం, సంపద ప్రాప్తి లభిస్తాయి.