Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ దూకుడు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు . హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ నివాసం, కార్యాలయాలతో పాటు అతని స్నేహితుల ఇళ్లలోనూ శుక్రవారం సోదాలు చేపట్టారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఇప్పటికే నమోదైన కేసులో బసరత్ ఖాన్ ఎవరెవరికి లగ్జరీ కార్లు అమ్మారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇంపోర్ట్ చేసిన లగ్జరీ కార్ల విక్రయాల్లో బసరత్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు ఆయన కార్లు విక్రయించారు. ఇటీవల స్మగ్లింగ్ చేసిన కార్లలో ఒకటి మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో ఉందన్న అనుమానాలు రేగాయి. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ “కార్ పార్టీ స్మగ్లింగ్ కార్ల మీద నడుస్తోందా?” అంటూ ట్వీట్ చేసి వివాదం రగిలించారు.

బండి సంజయ్ ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు వెంటనే ప్రతిస్పందిస్తూ — కేటీఆర్ సాధారణ విధానంలోనే కారును కొనుగోలు చేశారని, అదే సమయంలో బసరత్ ఖాన్ నుండి రాష్ట్ర మంత్రులు కూడా కార్లు కొనుగోలు చేసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు.

ఈ వివాదం ఇంకా చల్లారక ముందే ఈడీ జూబ్లీహిల్స్‌లోని బసరత్ ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని ఎస్కే కార్ లాంజ్, అలాగే అతని సన్నిహితుల ఇళ్లలో ముమ్మర సోదాలు నిర్వహించింది. అమెరికా, జపాన్ నుండి లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేసి, దుబాయ్, శ్రీలంక మార్గంగా భారత్‌కు తెచ్చినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.