వేల కోట్ల సంపద విరాళమిచ్చిన ప్రపంచకుబేరుడు
ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో రెండవ కుబేరుడయిన ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఒరాకిల్‌లో అతనికి 41 శాతం వాటా, టెస్లాలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. AI బూమ్ కారణంగా ఒరాకిల్ స్టాక్ లో పెరుగుదల కారణంగా ఇటీవలి కాలంలో అతని సంపద వేగంగా పెరిగింది. తన సంపదలో 95 శాతం విరాళంగా ఇస్తానని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2010లో గివింగ్ ప్లెడ్జ్‌లో భాగంగా ఎల్లిసన్ తన ప్రతిజ్ఞ చేశాడు. ఎక్కువ భాగం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లాభాపేక్షలేని తన సంస్థ ఎల్లిసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EIT) ద్వారా అందిస్తున్నాడు. EIT ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు, ఆహార భద్రత, AI పరిశోధన వంటి ప్రపంచ సవాళ్లపై పనిచేస్తుంది. ఎల్లిసన్ అనేక సార్లు ఉన్నత స్థాయి విరాళాలను అందించారు. క్యాన్సర్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అతను దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి 200 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధుల నివారణ కోసం ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్స్ కు సుమారు 1 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. ఎల్లిసన్ తన సంపద అంతా చివరికి తన సొంత ప్రణాళిక ప్రకారం నడిచే దాతృత్వ కార్యక్రమాలకు చేరుతుందని పేర్కొన్నారు.