నవరాత్రి వేళ టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీ
పండుగలు, వ్రతాలు, పూజల సందర్భంగా సాధారణంగా ప్రతీ ఇంట్లో పులిహోర చేసుకుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజూ అన్నంతో చేసిన ప్రసాదం నైవేద్యం పెడుతుంటాం. వీటిలో పులిహోర ముఖ్యమైనది. ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా గుడిలో ఇచ్చే పులిహోర ప్రసాదం రుచే వేరు. ఎలా చేశారబ్బా అనుకుంటాం.. ఇలాంటి టెంపుల్ స్టైల్ పులిహోర సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
• బియ్యం – అరకిలో
• నూనె – 6 టీస్పూన్లు
• చింతపండు – 60 గ్రాములు
• పల్లీలు – ఒక కప్పు
• జీడిపప్పు
• పోపుదినుసులు
• పసుపు
• బెల్లం ముక్క
• పచ్చిమిర్చి
మసాలా పొడి కోసం :
• మెంతులు – అరటీస్పూన్
• ధనియాలు – రెండు టీస్పూన్లు
• జీలకర్ర – ఒకటీస్పూన్
• ఆవాలు – ఒకటీస్పూన్
• మిరియాలు స్పూన్
తయారీ విధానం : ఒక గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. కుక్కర్ గిన్నెలో బియ్యం తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆపై అందులో మూడు గ్లాసుల మంచి నీళ్లు, కొద్దిగా నూనె వేసుకుని మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మసాలా పొడి కోసం స్టవ్ మీద పాన్ లో ముందుగా మెంతులు వేసి దోరగా వేయించాలి. అవి వేగాక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసుకుని అన్నింటినీ చక్కగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన ధనియాల మిశ్రమం వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రైస్ చక్కగా ఉడికిందనుకున్నాక కుక్కర్ లోని ఫ్రెషర్ మొత్తం పోయాక మూత తీసి అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేసిన్ లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా రైస్ పొడిపొడిగా తయారవుతుంది. రైస్ కొద్దిగా చల్లారేలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకుని ఒక కప్పు పరిమాణంలో చిక్కని గుజ్జుని తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని నూనె వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పల్లీలను వేసి వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకుని శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఆవాలు వేసుకుని కాసేపు వేయించాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ జత చేసి పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పక్కకి తీసిపెట్టుకుని, చింతపండు గుజ్జు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకుని ఆ మిశ్రమం కాస్త చిక్కగా మారేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు గుజ్జు మిశ్రమాన్ని బేసిన్ లోకి తీసుకున్న రైస్ లోకి వేసుకుని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా కలిపిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా మరోసారి కలపాలి. చివరగా పక్కకు తీసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని జత చేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, గుడిలో ప్రసాదంలా కమ్మని రుచితో నోరూరించే “పులిహోర” రెడీ అవుతుంది. దానిని అమ్మవారికి నైవేద్యం పెట్టి స్వీకరించవచ్చు.