Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ అగ్నిమిస్సైల్ విజయవంతం

దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు పై నుండి మొబైల్‌ లాంఛర్‌ అగ్నిమిస్సైల్‌ ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ విజయంతో భారత ఆయుధ శక్తి మరో కీలక ముందడుగు వేసింది. ఈవిషయాన్ని డీఆర్డీవో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. అణుసామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్‌ క్షిపణిని రైలుపై నుంచి ప్రయోగించినట్లు రాజ్‌నాథ్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. ఆయన రక్షణ పరిశోధనాభివద్ధి సంస్థ డీఆర్‌డీవో ను అభినందించారు. అతితక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్‌ లాంఛింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
‘‘ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం. రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి.. తక్కువ రియాక్షన్‌ టైమ్‌లో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ అగ్నిప్రైమ్‌ మిసైల్‌ లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనిలో రింగ్‌ లేజర్‌ గైరో ఇనర్షల్‌ నేవిగేషన్‌, మైక్రో ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌లను అమర్చారు. దీంతోపాటు జీపీఎస్‌, నావిక్‌ శాటిలైట్‌ నేవిగేషన్లకు కూడా దీన్ని వాడుకొనే ఆప్షన్‌ ఉంది. ఇక ఈ మిసైల్‌ కు ఉన్న కెనిస్టర్‌ డిజైన్‌ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపర్చవచ్చు. ఇది లాంఛింగ్‌కు అవసరమైన సమయాన్ని బాగా తగ్గిస్తుంది. ఇప్పటికే అగ్ని-పి క్షిపణి పలు టెస్టుల్లో సామర్థ్యాన్ని నిరూపించుకొంది. ఇది భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.