రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సీఎం శుభవార్త
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలను ఉద్యోగులకు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. సింగరేణి సంస్థ ఉద్యోగులు, కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి రూ. 1 కోటి బీమా అందజేస్తోంది. ఈ పథకం స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగులకు మరింత మెరుగైన బీమా సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది. సింగరేణి స్ఫూర్తితోనే కేంద్ర బొగ్గు శాఖ కూడా కోల్ ఇండియాలో ఇలాంటి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద మరణం సంభవిస్తే రూ. 1 కోటి బీమా లభిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 1.60 కోట్లు, రూపే డెబిట్ కార్డు ఉంటే అదనంగా మరో రూ. 1 కోటి చెల్లిస్తారు. అలాగే శాశ్వత వైకల్యానికి రూ. 1 కోటి, సహజ మరణానికి రూ. 10 లక్షల బీమా అందుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెరుగైన ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. కొన్ని బ్యాంకులు ఇప్పటికే అనేక రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించాయని.. ఇంకా ఎక్కువ బీమా కల్పించేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ పథకం అమలైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక భరోసా కలుగనుంది. ప్రమాద బీమాతో పాటు గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం ఉద్యోగులు నెలకు సుమారు రూ. 2,495 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో సంవత్సరానికి ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షల సదుపాయం కూడా ఉంటుంది. ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోనే అత్యుత్తమ ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు నిలుస్తారు.