బీసీ సంక్షేమానికి స్కోచ్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. బీసీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించడం, పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడం గుర్తించిన సోషల్ జస్టిస్ సెక్యూరిటీ సంస్థ స్కోచ్ అవార్డును ప్రకటించింది.ఈ అవార్డును శనివారం నాడు ఢిల్లీలో మంత్రి సవిత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “బీసీల అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. బీసీలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తూ బడుగు, బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్తున్నారు” అని తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 6,470 మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికవడం గర్వకారణమని చెప్పారు.అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో ఆధునిక బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో కూడా భారీ స్థాయి స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.“ఈ స్కోచ్ అవార్డు మాకు మరింత ఉత్సాహం నింపింది. భవిష్యత్‌లో కూడా బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తాము” అని మంత్రి సవిత స్పష్టం చేశారు.