స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం మాట్లాడదేం: బొత్స
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం నోరు విప్పట్లేదని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మీడియాతో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. “ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. మరి 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని, పోరాటం చేస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పెద్దలే రెండునాల్కల ధోరణి అవలంభిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా దీనిపై స్పందించాలి. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా యోగాలో గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రభుత్వం మాట్లాడలేదు. చంద్రబాబుకి, పవన్‌కి ప్రధానిని అడిగే బాధ్యత లేదా? కానీ ప్రతిపక్షంగా మేం దీన్ని వదిలిపెట్టం. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్ పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైసీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మనం కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి” అని పిలుపునిచ్చారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించే విషయంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. అని పేర్కొన్నారు.

