ఓటమిని అంగీకరించి కాళ్లబేరానికి వచ్చారు : రాజ్‌నాథ్ సింగ్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లు చెప్పారు. దాయాది తోక జాడిస్తే గట్టిగా బదులు ఉంటుందని హెచ్చరించారు. లోక్‌సభ లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోయిందని చెప్పారు. వెంటనే కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. పాక్ డీజీఎంవో వెంటనే భారత్‌ను సంప్రదించినట్లు చెప్పారు. ‘మన సైనిక దళం చేసిన ఖచ్చితమైన దాడుల తర్వాత పాక్ కాళ్లబేరానికి వచ్చింది. ఓటమిని అంగీకరించింది. యుద్ధాన్ని ఆపాలని ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్‌ను ఆపాం. భవిష్యత్తులో పాకిస్థాన్ దాడులకు పాల్పడితే.. గట్టిగా బదులిస్తాం’ అని రాజ్‌నాథ్ హెచ్చరించారు. పాక్ దాడులను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రాజ్‌నాథ్ తెలిపారు. పాక్ నుంచి వచ్చిన అన్ని దాడులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని రక్షణమంత్రి మండిపడ్డారు. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైందని లోక్‌సభలో గట్టిగా చెప్పారు. సైనిక చర్యలపై ప్రశ్నలు వేసేటప్పుడు ఆచితూచి, ఆలోచించి ప్రశ్నించాలని విపక్షాలకు సూచించారు.