ఇలాంటి వాళ్లతో దేశానికే ముప్పు : ప్రధాని మోడీ
పశ్చిమబెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వైద్యురాలి హత్యాచారంతో ప్రమేయమున్న నిందితులను టీఎంసీ నేతలు రక్షణ కల్పిస్తున్నారని ఆర్జీ కర్ హాస్పిటల్ కేసును ప్రస్తావిస్తూ ఆరోపించారు. రాష్ట్రంలోని ఆడకూతుళ్లపై జరుగుతున్న ఘటనలు తీవ్ర వేదన కలిగిస్తున్నాయని తెలిపారు. ఆ ఘటనకు టీఎంసీలోని ప్రముఖ నేతలు, మంత్రులు నిందితులపై చర్యలు తీసుకోవడానికి బదులు బాధితులపై విమర్శలకు దిగుతున్నారు’ అని మోదీ అన్నారు. దేశంలో చొరబాటుదారుల మార్గం సుగమం చేస్తున్నారని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మోదీ తప్పుపట్టారు. చొరబాటుదారులకు ఫేక్ డాక్యుమెంట్లు సమకూరుస్తున్నారని, ఇలాంటి వాళ్లతో రాష్ట్ర ఐడెంటికే ముప్పు తలెత్తుతుందని హెచ్చరించారు. బెంగాల్ ప్రతిష్ఠ బీజేపీకి కీలకమని, కానీ టీఎంసీ సొంత ప్రయోజనాల కోసం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ పశ్చిమబెంగాల్ ఉనికికే ముప్పు తెస్తోందని ఆరోపించారు. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను పరోక్షంగా మోదీ ప్రస్తావిస్తూ, టీఎంసీకి ఉద్వాసన చెబితేనే రాష్ట్రంలోని నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. టీఎంసీ గోడ ఎప్పుడైతే కుప్పకూలుతుందో ఆ రోజు నుంచి బెంగాల్‌లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. అప్పుడే నిజమైన మార్పు వస్తుందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని ప్రస్తుత సమస్యలను గుర్తించి.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలోనే లీడింగ్ ఇండస్ట్రియల్ హబ్‌లలో ఒకటిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని యువతకు ప్రధాని భరోసా ఇచ్చారు.