కవితపై కేసు నమోదు
తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి, దాడులు ప్రతి దాడులతో రోజుకో సంచలనం తెరపైకి వస్తుంది… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడి కవిత ప్రోద్బలంతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు ప్రకారం, సుమారు 50 మంది అనుచరులు మారణాయుధాలతో దాడికి దిగారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని మల్లన్న పేర్కొన్నారు. ఘటన సమయంలో ఆయన కార్యాలయంలో ఉన్నట్టు, కార్యకర్తలు తలుపులు పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లి దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన కుడిచేతికి స్వల్ప గాయమవగా, అప్రమత్తమైన గన్ మేన్ శ్రీనివాస్ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దాడిలో జాగృతి కార్యకర్త సాయికి గాయమవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి జిల్లా జాగృతి అధ్యక్షుడు సందుపట్ల సుజిత్ రావు, ఉస్మానియా యూనివర్సిటీ జాగృతి అధ్యక్షుడు అశోక్ యాదవ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీన్మార్ మల్లన్న తనపై దాడి చేసినవారు గన్ మేన్ తుపాకిని లాక్కొని కాల్చేందుకు యత్నించారని ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.