Home Page Sliderhome page sliderNewsNews AlertPoliticsTelanganaTrending Todayviral

నేను వచ్చాను… నువ్వు ఢిల్లీ పారిపోయావా రేవంత్

తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగ చర్చకు ఆహ్వానించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వద్ద హాజరై సీఎం గైర్హాజరును తీవ్రంగా విమర్శించారు. “నేను చర్చకు వచ్చాను.. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయారు. ఇది రచ్చ కాదు, ప్రజా సమస్యలపై చర్చ. చర్చకు ధైర్యం లేకపోతే మరోసారి సవాళ్లు విసరొద్దు” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని బస్తాల ద్వారా కాపాడుకునే పరిస్థితి రేవంత్‌దని ఎద్దేవా చేసిన కేటీఆర్, “ఏ బస్తాలు మోసి సీఎం కుర్చీ కాపాడుకుంటున్నారో ప్రజలకు తెలిసిందే” అని విరుచుకుపడ్డారు. అలాగే, సీఎం అయినా ఏ బేసిన్‌ ఎక్కడుందో తెలియకపోవడంపై చురకలు వేశారు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు రేవంత్‌ తొత్తులకు అనే దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రెండు మూడు రోజులు తప్పించుకోవచ్చేమో కానీ ప్రజలు మాత్రం క్షమించరని హెచ్చరించిన కేటీఆర్, రేవంత్‌రెడ్డి ఇచ్చే మాటలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. “ఒకప్పుడు కొండగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వారు.. ఇప్పుడు మాట తప్పడంలో మేటి” అని చురకలు అంటించారు.చర్చ కోసం మంత్రులను అయినా పంపుతారని అనుకున్నానని, కానీ ఎవరూ రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మళ్లీ ఎప్పుడైనా చర్చకు పిలిస్తే తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. “ప్లేస్, టైం సీఎం రేవంత్ డిసైడ్ చేయండి – నేనెప్పుడైనా సిద్ధం” అని ఛాలెంజ్ విసిరారు. గతంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తామని, బాండ్ పేపర్ మీద రాసిచ్చారని గుర్తుచేసిన కేటీఆర్, ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. “చరిత్రలో ఏ రకమైన చర్చకైనా సిద్ధమని చెప్పి పారిపోయిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కావచ్చు” అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.