మస్క్ కంపెనీ అద్భుతం ఈ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్
పుట్టకతోనే చెవిటివారికి కూడా వినిపించేలా అద్భుతమైన బ్రెయిన్ చిప్ తయారు చేసింది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు సంబంధించిన బ్రెయిన్ టెక్నాలజీ సంస్థ. ఎవరైనా, ఎలాంటి కారణాలతో వినికిడి కోల్పోయిన సందర్భాల్లోనూ వినికిడిని పొందేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ సహాయపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు. వినికిడి లోపం గురించి యూజర్లను హెచ్చరించిన ఎక్స్ లోని ఒక పోస్టు ప్రతిస్పందనగా మస్క్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. కెర్నల్ కంపెనీ సీఈఓ బ్రెయిన్ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ..’మీ చెవులను సంరక్షించుకోండి. వినికిడి కోల్పేతే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో లేవు. డెమెన్షియా వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం 5 రెట్లు ఉంటుంది. 30-40% మెదడుపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెవి లోపలి కణాలు పాడైతే సహజ వినికిడిని పునరుద్ధరించలేం. కాబట్టి మీ చెవులకు గరిష్టంగా 80 డెసిబుల్స్ మించి శబ్దాలను దరిచేరకుండా జాగ్రత్తపడండి. శబ్దాలను కొలిచే యాప్లో ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా మస్క్..’వినికిడిని పునరుద్ధరించడానికి న్యూరాలింక్ ద్వారా ఒక స్పష్టమైన మార్గం సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి పూర్తిగా వినికిడి లేనివారికి కూడా వినికిడి వచ్చేలా చేయవచ్చు. ఎందుకంటే న్యూరాలింక్ పరికరం ధ్వనిని ప్రాసెస్ చేసే మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేస్తుంది’ అని చెప్పారు. ఎలాన్ మస్క్ కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ ఇప్పటికే రెండో ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని కంపెనీ గతంలో తెలిపింది.