డైవోర్సీ క్యాంపులతో మహిళలకు అండగా రఫియా.
విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో మానసిక, శారీరక క్షోభ తర్వాత భరించలేక మాత్రమే చాలామంది మహిళలు విడాకుల వరకూ వెళతారు. అలా విడాకులు తీసుకున్న మహిళల్ని దోషులుగానే చూస్తుందీ సమాజం. తప్పంతా వాళ్లదే అంటూ నిందలేస్తుంది. వివాహబంధం వీగిపోయి అప్పటికే బాధలో ఉన్న వారిని ఇలాంటి మాటలు మరింత కుంగదీస్తాయి. పోనీ తల్లిదండ్రులైనా అండగా నిలబడతారనుకుంటే. కొంతమంది విషయంలో ఆ ఆసరా కూడా దక్కట్లేదు. అందుకే ఇలాంటి వాళ్లకు అండగా నిలబడేందుకు, వారి జీవితాల్లో తిరిగి ఆనందం నింపేందుకు కంకణం కట్టుకుంది కేరళకు చెందిన రఫియా అఫీ. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న మహిళల కోసం ప్రత్యేకంగా ‘డివోర్సీ క్యాంప్స్’ ఏర్పాటుచేస్తోందామె. ఇలా ఇటీవలే తన తొలి ప్రయత్నం సఫలం కావడంతో.. మరిన్ని క్యాంప్స్ నిర్వహించేందుకు ప్లానింగ్ చేస్తోంది రఫియా. తాను కూడా ఇలాగే విడాకులు తీసుకుని ఎంతో క్షోభ అనుభవించానని తన కథను పంచుకుంది. ‘విడాకులు తీసుకున్నాక ఎంతో మానసిక క్షోభను అనుభవించా. ఒంటరిగా ఫీలయ్యా. దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించా. ఈ క్రమంలోనే ఓసారి నా విడాకుల కథను సోషల్ మీడియాలో పంచుకున్నా. చాలామంది మహిళలు స్పందించారు. కొందరు వివాహబంధంలో తామెదుర్కొంటున్న సమస్యల్ని పంచుకున్నారు.. మరికొందరు విడాకుల కారణంగా సమాజం నుంచి ఎలాంటి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారో చెప్పుకొచ్చారు. అప్పుడే నేను ఒంటరిని కాదు.. నాలా ఎంతోమంది బాధితులున్నారన్న విషయం నాకు అర్థమైంది. అంతేకాదు.. చాలామందికి వాళ్ల తల్లిదండ్రుల నుంచీ ఆదరణ కరువైనట్లూ తెలుసుకున్నా. ఈ క్రమంలోనే ఎలాగైనా వాళ్లను ఈ దుర్దశ నుంచి బయటపడేయాలనిపించింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడే ‘డివోర్సీ క్యాంప్స్’ ఐడియా మనసులో తట్టింది..’ అని చెబుతోన్న ఈ డేరింగ్ లేడీ.. ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ అనే బ్యానర్ వేదికగా ఈ క్యాంప్స్ కు అంకురార్పణ చేసింది. ఈ ప్రోత్సాహంతోనే భవిష్యత్తులో మరిన్ని డివోర్సీ క్యాంప్స్ ఏర్పాటుచేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతోన్న రఫియా.. విడాకులు తీసుకున్న మహిళలకు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల మద్దతు దక్కినప్పుడే వారు ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడగలరని అంటోంది. ‘మహిళల విడాకులకు కారణం.. వారి వ్యక్తిగత వైఫల్యమే అంటోంది మన సమాజం. చాలామంది తల్లిదండ్రులు కూడా ఇదే ధోరణిలో ఉన్నారు. కానీ వీళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. అప్పుడే వాళ్లు పూర్తిగా కోలుకోగలుగుతారు. అందుకే ఆయా మహిళల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకూ ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, సెషన్స్ నిర్వహిస్తున్నాం. తొలి క్యాంప్స్ సక్సెస్ కావడంతో మరిన్ని క్యాంప్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. వీటిలో భాగమయ్యే మహిళల కోసం సాహస క్రీడలు, ఆత్మరక్షణ విద్యలు, ఆర్థిక అంశాలు-కెరీర్ పై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్స్ .. వంటి కొత్త కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్న ఆలోచన చేస్తున్నాం. విడాకులు తీసుకున్నా విలువైన జీవితం ఎలా గడపాలో మా క్యాంప్స్ ద్వారా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ప్రస్తుతం మహిళల నుంచే కాదు.. విడాకులు తీసుకున్న పురుషులూ తమకూ ప్రత్యేక డివోర్సీ క్యాంప్స్ ఏర్పాటుచేయమంటూ సందేశాలు పంపుతున్నారు. కాల్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఆలోచననూ ఆచరణలో పెడతా..’ అంటోంది రఫియా.

