“దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడు”..మంత్రి సవాల్
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. మీ పదేళ్ల పాలనలో అద్భుతాలు జరిగిపోయాయని, ఘనకార్యాలు చేసేసామని గొప్పలు చెప్తూ అమాయక ప్రజలను మభ్యపెట్టడం మంచిది కాదని ధ్వజమెత్తారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సభలో మాట్లాడి పరువు తీసుకున్నారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో దేశంలోనే ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఎదిగిందని, రూ.1500 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయలేదని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చిందన్నారు. అలాంటి పార్టీని తెలంగాణకు విలన్ అంటూ కేసీఆర్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని పేర్కొన్నారు.