ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు కొత్త టెన్షన్..
ఏపీలో ఎట్టకేలకు 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలయ్యింది. అయితే ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయని, కంప్యూటర్ ఆధారితంగా జూన్ 6 నుండి జూలై 6 వరకూ రెండు షిఫ్టుల చొప్పున నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ పరీక్షలలో ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లలో ఒక పేపర్ ఈజీగా, మరో సెషన్లో పేపర్ కష్టంగా ఉండే అవకాశం ఉంది. దీనితో ఇతర పోటీ పరీక్షల విధానంలోనే నార్మలైజేషన్ ప్రక్రియను అమలు చేస్తారేమో అనే ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆప్‌లైన్ ఎగ్జామ్ ఉండడంతో అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్( సీబీటీ) విధానం వల్ల నార్మలైజేషన్ అంటే సులభంగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి సరాసరి మార్కులేస్తారు. దీనితో ఎవరికి ఎన్ని మార్కులొస్తాయో ఖచ్చితమైన అంచనా వేసే అవకాశం ఉండదు. దీనితో అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది.

