ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడంపై తిరుమల ప్రస్తావన..
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్డులో వాడివేడిగా వాదనలు సాగాయి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన 73 పిటిషన్లపై సర్వోన్నత న్యాయ స్థానం విచారణ చేపట్టింది. సవరించిన వక్ఫ్ చట్టంలోని అతిముఖ్యమైన నిబంధన.. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడంపై ప్రధానంగా విచారణ జరిగింది. ఈ చర్య ముస్లింలు తమ మతాన్ని ఆచరించే స్వేచ్ఛను దెబ్బతీస్తుందని పిటిషనర్లు వాదించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డులో మాదిరిగా.. ఇకపై టీటీడీ, హిందు ట్రస్ట్ బోర్డుల్లో హిందుయేతరలను చేర్చుకుంటారా అని ప్రశ్నించారు సీజేఐ. ఇప్పటివరకు టీటీడీలో హిందువులు కాని వారు ఉన్నారా? ఉంటే ఒక ఉదాహరణ ఇవ్వాలని జస్టిస్ సంజయ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చాలన్నప్పుడు.. హిందు ట్రస్ట్ బోర్డులో హిందుయేతరులను ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది ధర్మాసనం. అలాగే.. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని పేర్కొంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. హింసాత్మక ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని ధర్మాసనం పేర్కొంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోకా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. చట్టంపై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది.

