సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
సాధారణంగా వేసవి కాలంలో పాఠశాలలు, కళాశాలలు సెలవుల కారణంగా తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు పూర్తవడంతో భక్తులు తిరుమలకు ప్రయాణం కడతారు. ఈ రద్దీని ఎదుర్కోవడానికి టీటీడీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించాలని, ఈ కాలంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించే అంశాలను పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి జూన్ 30వ తేదీ వరకూ సిఫార్సు లేఖలు కూడా తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ప్రతీరోజూ 4 వేల వీఐపీ టిక్కెట్లు ఇస్తున్నారు. శ్రీవాణి టిక్కెట్లు 1500, ఇతర దాతలు, కళ్యాణం టిక్కెట్లు 5 వేలు ఇస్తున్నారు. దీనితో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీఐపీలు ఇచ్చే సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించే అవకాశాలున్నాయి. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే ఈ దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.

