ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఒక టీవి ఛానెల్ ఎండీ శ్రవణ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌నిచ్చి ఊరటనిచ్చింది. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన తరపు లాయర్ సుప్రీంకోర్టును ఆక్రమించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు శ్రవణ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోలీసు విచారణకు సహకరించాలని శ్రవణ్ కుమార్‌ను ఆదేశించింది. ఏడాదిగా పరారీలో ఉన్నారని, అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే అతనికి అరెస్టు నుండి రక్షణ కల్పించకపోతే అతను భారత్‌కు వచ్చే అవకాశాలు ఉండవని, విచారణకు సహకరించాలంటే అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. రెండు రోజుల్లో శ్రవణ్ కుమార్ భారత్ వచ్చి విచారణకు సహకరిస్తారని పేర్కొన్నారు. దీనితో అతనికి ముందస్తు బెయిల్ లభించింది. అయితే ప్రభుత్వ టార్గెట్ శ్రవణ్ కుమార్ కాదని, అతని ద్వారా మరెవరినో పట్టుకోవాలనే ప్రభుత్వ ప్రణాళికగా ఉందని న్యాయవాది మీడియాకు తెలిపారు.