InternationalNewsNews Alert

పైలట్ల సమ్మెతో..ప్రయాణికుల ఇక్కట్లు

ప్రపంచవ్యాప్తంగా నేడు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఆ సంస్థలో పనిచేస్తున్న పైలట్లు ఈ రోజు సమ్మె బాట పట్టడమే. దీంతో నేడు దాదాపు 800 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆ సంస్థ తమ విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో 1,30,000 మంది ప్రయాణికులు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ ఏడాది 5.5% జీతాలు పెంచాలని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ పైలట్లు డిమాండ్ చేస్తూ.. నిరసనకు దిగారు.

అయితే వీరి ప్రతిపాదనను యాజమాన్యం తోసిపుచ్చింది. యాజమాన్యం నిర్ణయాన్ని పైలట్ల యూనియన్ నిరాకరించింది. ఈ మేరకు యాజమాన్యాన్ని సమ్మె చేస్తామని హెచ్చరించింది.అయినప్పటికీ వారు దిగిరాకపోవడంతో పైలట్లు సమ్మెకు దిగారు.  ఈ సమ్మె ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమాన సర్వీసులపై పడింది. ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రయాణికులు దీనికి ప్రత్యమ్నాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.