వినాయక నిమజ్జనంలో అపశృతి 7మంది మృతి
దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఆయా రాష్ట్రాల్లో అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నిమజ్జన వేడుకల్లో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, హర్యానా రాష్ట్రంలో వినాయక నిమజ్జనాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రంలో మూడు వేర్వేరు ఘటనల్లో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న 7 మంది నీటిలో మునిగి చనిపోయారు.

హర్యానాలోని సోనిపట్‌లో నిమజ్జనం చేస్తూ, ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మహేంద్రగఢ్‌లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నిమజ్జనం సందర్భంగా సమీపంలోని చెరువులు, నదుల వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోనిపట్‌లోని మిమార్పూర్ ఘాట్ వద్ద నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. మహేంద్రగఢ్ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న కాలువలో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9 మంది కొట్టుకుపోయారు.

విషయం తెలుసుకున్న అధికారులు..వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు, అర్ధరాత్రి సమయంలో 8 మందిని వెలికి తీశారు. వీరిలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం ఆయా కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.


 
							 
							