5 వేల కార్ల చోరీ… 27 ఏళ్లలో ఢిల్లీ ఆటో డ్రైవర్ అరాచకాలు
1995 నుంచి పథకం ప్రకారం ఢిల్లీ ఖాన్‌పూర్ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్న అనిల్ చౌహాన్‌ను ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇండియాలోనే అతిపెద్ద కార్ల దొంగ అనిల్ చౌహన్. 52 ఏళ్ల అనిల్‌కు ఢిల్లీ, ముంబై, ఈశాన్యరాష్ట్రాల్లోనూ ఆస్తులున్నట్టు తేలింది. 27 ఏళ్లలో 5 వేల కార్లను దొంగతనం చేసినట్టుగా ఢిల్లీ సెంట్రల్ పోలీసులు పేర్కొన్నారు. మొన్నటి వరకు కార్ల దొంగతనంలో తనమనుకలైన అనిల్ చౌహన్ తాజాగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. యూపీ నుంచి ఆయుధాలు తెచ్చి… ఈశాన్య రాష్ట్రాలకు వాటిని సరఫరా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

పలు రకాల కార్లు ఉన్నప్పటికీ అనిల్ కన్ను ఎప్పుడూ మారుతి 800 కార్లపైనే పడేది. చోరీ చేసిన కార్లను నేపాల్, జమ్ము& కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపించేవాడు. ఈ తరుణంలో తన బండారం బయటపడకుండా ఉండేందుకు ట్యాక్సీ డ్రైవర్లను హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. అసోం వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనిల్ భావించాడు. ఈడీ అధికారులు అనిల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ దగ్గర నుంచి ఆరు పిస్తోళ్లతోపాటు, ఏడు కార్ట్‌రిడ్జులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2015లో అనిల్ ను ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

2020లో జైలు నుంచి బయటకు వచ్చాక బుద్ధి ఏ మాత్రం మార్చుకోకుండా పాత వృత్తిని కొనసాగించడంతో పోలీసులకు చిక్కాడు. దేశ వ్యాప్తంగా అనిల్‌పై 180 కేసులు నమోదయ్యాయి. అనిల్‌కు ముగ్గురు భార్యలు, ఏడుగురు సంతానం. అసోంలో ప్రభుత్వ కాంట్రాక్టులు నిర్వహిస్తూ స్థానిక నాయకులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దందా సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.