రాష్ట్రంలో 4 కోతులు-నమ్మించి నట్టేట ముంచడమే దుష్ట చతుష్టయం నీతి…జగన్
ఏపీ రాష్ట్రంలో మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దనే 4 కోతులు ఉన్నాయని, ప్రజలను నమ్మించి నట్టేట ముంచడమే దుష్ట చతుష్టయం నీతి అని ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. ఈరోజు పార్వతీపురం కురుపాంలో బహిరంగసభ నిర్వహించారు జగన్. ఈ కార్యక్రమంలో ‘జగనన్న అమ్మ ఒడి’ కింద 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు. గడచిన ఈ నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం . చదువులో అంటరానితనాన్ని రూపు మాపగలిగామన్నారు.

నా పేద పిల్లల్లో ఏ ఒక్కరు పేదరికం కారణంగా చదువు ఆగకూడదనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల భవిష్యత్తు కోసం విద్య పై పెట్టుబడి పెడుతున్నాం.” సీఎం జగన్ పేర్కొన్నారు. నేడు 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశామని తెలిపారు. తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని సీఎం పేర్కొన్నారు. లంచమనే మాట లేకుండా బటన్ నొక్కటమంటే ఇదని ఆ బడుద్దాయిలకు చెప్పమని సీఎం అన్నారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్, అభివృద్ధి కోసం అమ్మఒడి నిధుల నుండి రెండువేల రూపాయలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులకు జగన్ విజ్ఞప్తి చేశారు.

ఇంత మంచి కనిపిస్తున్నా కూడా జీర్ణించుకోని వారు కొంత మంది ఉన్నారని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు, ఆ నాయకుడి కోసం 15 ఏళ్ల క్రితమే పుట్టిన ఓ దత్త పుత్రుడని విపక్షాల పై సీఎం విమిర్శల జల్లు కురిపించారు. వీళ్లు టీడీపీ (తినుకో, దోచుకో, పంచుకో)తో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ , బొజ్జలు పెంచుకుంటూ, బొజ్జ రాక్షసుల పత్రికలు, టీవీలు అన్నీ కూడా మనల్ని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. దుష్ట చతుష్టయం పునాదులు సమాజాన్ని చీల్చేలా ఉంటాయన్నారు. వారాహి ఎక్కి నోటికి అద్దు అదుపు లేని మాటలు మాట్లాడతానని, చంపుతా, చెప్పుతో కొడతా అంటూ వైసీపీ నాయకులను రౌడీల్లాగ బెదిరిస్తున్నాడని మండిపడ్డారు.
కానీ మన పునాదులు పేదల పట్ల ప్రేమ నుంచి, రైతుల మమకారం నుంచి అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల బాధ్యతలోనుంచి పుట్టాయని పేర్కొన్నారు. మన పునాదులు నేరుగా బటన్ నొక్కే డీబీటీ నుంచి పుట్టాయని వారిలా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం కాదని అన్నారు. సింగపురంలో మినీ రిజర్వాయర్ కోసం రూ.38 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి, ఎత్తిపోతల ప్రాజెక్ట్, క్రాసింగ్ నెట్ ప్లాంట్‌ను కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.