6 రోజులు 22 ర్యాలీలు, కర్నాటకలో మోదీ ఎన్నికల ప్రచారం
ఈ వారాంతంలో కర్నాటక రణరంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగనున్నారు. ప్రధాని మోదీ బిజీ ప్రచార షెడ్యూల్ బెంగళూరు రోడ్‌షో మొదలవుతుంది. వచ్చే రెండు వారాల్లో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా 22 ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆరు రోజుల పర్యటనలో, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ దాదాపు 22 ర్యాలీల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి పర్యటనలో, ప్రధాని మోదీ మూడు కంటే ఎక్కువ ర్యాలీల్లో పాల్గొంటారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ రాణిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని… ప్రధాని నరేంద్ర మోదీ యుద్దభూమిలోకి దిగితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మోదీ రాకతో ప్రచారం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని… ఊపు వస్తోందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏప్రిల్ 29న హుమ్నాబాద్, విజయపుర, కుడాచి, బెంగళూరు నార్త్‌లలో మోదీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ కోలార్, చన్నపట్నం, బేలూరులో ర్యాలీల్లో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చే వారం ప్రధాని కర్నాటక వస్తారు. మే 2న చిత్రదుర్గ, విజయనగరం, సింధనూరు, కలబుర్గిలలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మే 3న మూడబిద్రి, కార్వార్, కిత్తూరులో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మే 6న చిత్తాపూర్, నంజన్‌గూడు, తుమకూరు రూరల్, బెంగళూరు సౌత్‌లో ఉంటారు. ప్రచారం ముగిసే ముందు చివరి రోజున, మే 7న ప్రధాని 4 ర్యాలీల్లో ప్రసంగిస్తారు. బాదామి, హావేరి, శివమొగ్గ రూరల్, బెంగళూరు సెంట్రల్‌లో సభలను పార్టీ ప్లాన్ చేస్తోంది.

దక్షిణాది రాష్ట్రంలో మళ్లీ గెలవాలని కాషాయ పార్టీ శతధా ప్రయత్నిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ చెబుతోంది. రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ తన ఎన్నికల ఇంచార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రకటించింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య, టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలై కో-ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. పార్టీ ప్రచార కమిటీకి సీఎం బస్వరాజ్ బొమ్మై నేతృత్వం వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కన్వీనర్‌గా నిర్వహిస్తున్నారు. మార్చి 29న ఈసీ కర్నాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 224 స్థానాలున్న అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న కౌంటింగ్ జరగనుంది.