22మంది భారతీయులకు పాక్ జైలు నుండి విముక్తి
పాకిస్తాన్ జైళ్లలో మగ్గిపోతున్న 22 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది. కరాచీలోని మాలిర్ కారాగారం నుండి వారి శిక్షాకాలం పూర్తి కావడంతో శుక్రవారం బయటకు వచ్చారు. వారిని నేడు భారత్‌కు అప్పగించే అవకాశముందని జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఈది ఫౌండేషన్ సహాయంతో వారు కరాచీ నుండి లాహోర్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీరిని వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు అప్పగిస్తారు. మత్స్యకారులు సరిహద్దులను సరిగ్గా గుర్తించకపోవడంతో ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయని, ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని ఈది ఫౌండేషన్ భారత్- పాక్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఇంకా పాక్‌లో 266 మంది భారత ఖైదీలు, భారత్‌లో 462 మంది పాక్ ఖైదీలు ఉన్నట్లు సమాచారం.

