తెలంగాణలో 14 వేల అంగన్ వాడీ పోస్టుల భర్తీ..హామీ ఇచ్చిన మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14 వేల అంగన్ వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. సోమవారం ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలోని 4 వేల మినీ అంగన్ వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. ములుగులో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆటోడ్రైవర్లు మహిళల బస్సు ప్రయాణం గురించి ఆందోళన చెందవద్దని, వారికి సంవత్సరానికి రూ.12 వేల రూపాయలు హామీ ఇస్తున్నామని తెలియజేశారు. ఆటో డ్రైవర్ల యూనియన్లతో మాట్లాడుతామన్నారు.

