గుజరాత్‌లో కేబుల్ వంతెన కూలి 140 మంది దుర్మరణం
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెలవు రోజున నదిపై సరదాగా గడుపుదామనుకున్న పర్యటకులకు ప్రాణాంతకమైంది. మోర్బీ జిల్లాలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు మణి మందిర్ సమీపంలోని మచ్చూ నదిపై 140 ఏళ్ల క్రితం నాటి వేలాడే వంతెన ప్రమాదవశాత్తు తెగిపోయింది. మధ్యలో తెగిన వంతెన రెండుగా విడిపోవడంతో దానిపై నిలుచున్న పర్యాటకులు నదిలో మునిగిపోయారు. వంతెన తెగినప్పుడు దానిపై మహిళలు, చిన్నారులతో సహా 400 మందికి పైగా ఉన్నారని.. వాళ్లంతా హాహాకారాలు చేస్తూ నదిలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో 140 మంది మృతి చెందినట్లు సమాచారం. 100 మీటర్ల ఎత్తు నుంచి నదిలో పడిపోవడంతో 100 మందికి పైగా గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.

వంతెనకు ఐదు రోజుల క్రితమే మరమ్మతులు..
నదిలోకి కుంగిపోయిన వంతెనను పట్టుకొని కొందరు ప్రాణాలు కాపాడుకున్నారు. వేలాడుతున్న వంతెనను పట్టుకొని పైకి ఎక్కేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ వంతెనకు ఐదు రోజుల క్రితమే మరమ్మతులు చేశారు. ఇంత త్వరగా ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత గంట సేపటికి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 18 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం.. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించాయి.