ప్రేక్షకుల అభిమానమే 100 కోట్లు
కార్తికేయ2 సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈసందర్భంగా చిత్ర బృందం కర్నూల్‌లో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదని, తనపై, కార్తికేయ-2 పై ప్రేక్షకులు చూపించిన ప్రేమే తనకు 100 కోట్లతో సమానమని పేర్కొన్నారు. తనకు అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ కు ఉన్నంత ఫాలోయింగ్ లేకపోయినా ప్రేక్షకుల అభిమానం ఉందన్నారు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్తికేయ-2 హిందీలో డబ్ చేస్తుంటే, తనకు చాలా భయం వేసిందని, నేనేంటి ? హిందీలో సినిమా ఏంటి ? అని అనుకున్నానని చెప్పారు. కానీ విడుదల అయ్యాక, దేశవ్యాప్తంగా 1200 స్క్రీన్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, ఇది తెలుగు సినిమా గొప్పతనమే అని పేర్కొన్నారు. సినిమాని పెద్దగా ప్రమోట్ చేయకున్నా, ప్రేక్షకులే సినిమాని ముందుకు తీసుకెళ్లారన్నారు.

హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ మాట్లాడుతూ 2014లో తన ఫోటోలను తన స్నేహితురాలు ఆడిషన్‌కు పంపిందని, అలా ప్రేమమ్ చిత్రంలో అవకాశం వచ్చిందని తెలిపారు. తర్వాత 2017లో నటించిన శతమానం భవతిని కూడా ప్రేక్షకులు ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా కార్తికేయ 2 విజయాన్ని సాధించిందని, ప్రతి ఒక్క ప్రేక్షకునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు.