News

ద్వేషాన్ని పెంచుతున్న బీజేపీ-మెగా ర్యాలీలో రాహుల్ విమర్శలు

దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజలు భవిష్యత్ గురించి ధరల పెరుగుదల గురించి, నిరుద్యోగం గురించి భయపడుతుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం వారిని ద్వేషం వైపు మళ్లిస్తున్నారంటూ ఆక్షేపించారు. దేశంలో ఇద్దరు వ్యాపారులు మాత్రమే ప్రభుత్వం నుండి ప్రయోజనాలను అనుభవిస్తున్నారని… వారికి ప్రధానమంత్రి సహకరిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయన్నారు.

మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఇద్దరు వ్యాపారులు మాత్రమే… ప్రభుత్వం నుండి ప్రయోజనాలను అనుభవిస్తున్నారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, రోడ్లు కావచ్చు.. అన్నింటినీ ఈ ఇద్దరు వ్యక్తులు స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ద్వేషం, కోపం పెరుగుతోందని, మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలపై ఒత్తిడి పెరిగిందన్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్నారని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దీని వల్ల పాకిస్థాన్, చైనాలు లబ్ది పొందుతున్నాయన్నారు. సెప్టెంబరు 7న ప్రారంభమయ్యే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పార్టీ 3,500 కి.మీ భారత్ జోడో యాత్ర’కు శ్రీకారం చుట్టేందుకు రాహుల్ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.