కాళేశ్వరం పై విషప్రచారాలు ఆపాలి : కేటీఆర్
‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసితెలియక మాట్లాడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. త్రీ గోర్జెస్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనాకు 16 ఏళ్లు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నాలుగేళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్ ది. 371 పిల్లర్లు కలిగిన మూడు బరాజ్‌లలో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే విష ప్రచారాన్ని ఆపి.. కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి’ అని బీఆర్ఎ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ పనులు చేపట్టడం లేదన్నారు. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023 నాటికి రెండు పంటలకు కలిపి 2.29 కోట్ల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్, హరియాణాలను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసిఆర్ అగ్రస్థానంలో నిలిపారన్నారు. పదేళ్లలో తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదని, మితిమీరి అప్పులు చేయలేదని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చేయకూడని అప్పు, చేయకూడని తప్పులేవీ చేయలేదని కేటీఆర్ అన్నారు.