ఆస్పత్రిలో డాక్టర్లపై మహిళ దాడి
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. కడుపునొప్పితో బాధపడుతున్న లలిత కరీర అనే మహిళ అత్యవసర విభాగానికి చికిత్స కోసం వెళ్లింది. వైద్యులు పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆమెకు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదని తెలిపారు.
అయితే వైద్యుల సమాధానంతో అసంతృప్తికి గురైన మహిళ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైంది. విధుల్లో ఉన్న వైద్యులను దూషించడమే కాకుండా వారిపై భౌతిక దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆస్పత్రిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆమె తన కారులో అక్కడి నుంచి వనస్థలిపురంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయింది.
ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైద్య సిబ్బందిపై ఆమె దాడికి పాల్పడటానికి గల కారణాలు ఏమిటి? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

