Andhra PradeshHome Page Slider

పేరుకే పెద్దాసుపత్రి.. మందులిచ్చే నాథుడు లేడు?

Share with

హిందూపురం: నిర్వహణ లోపంతో హిందూపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో రోజు 800 మంది ఓపీ విభాగంలో చూపించుకోడానికి, మరో 200 మంది లోపల చేరే రోగులు (ఐపీ) చికిత్స పొందుతున్నారు. వెరసి రోజు 1,000 మందికి వివిధ రకాల మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆసుపత్రికి ఫార్మసీ సూపర్‌వైజర్, గ్రేడ్-1 ఫార్మసిస్ట్, మూడు గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టులు ఉండగా.. సూపర్‌వైజర్‌తో పాటు గ్రేడ్-2 ఫార్మసిస్ట్ ఒకరు, కాంట్రాక్ట్ పద్ధతిపై ఒకరు పనిచేస్తున్నారు. మిగిలిన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరు గురువారం వివిధ కారణాలతో విధులకు హాజరు కాలేదు. రోగులకు మందులను శిక్షణలో ఉన్న డి-ఫార్మసీ విద్యార్థులే ఇచ్చారు. వారు అసలే శిక్షణ విద్యార్థులు. డాక్టర్లు రాసిన మందులకు బదులుగా పొరపాటున ఇతర రకాలు ఇస్తే రోగుల పరిస్థితి ఏమిటి? పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డి-ఫార్మసీ చదివే విద్యార్థులు శిక్షణలో భాగంగా 3 నెలల పాటు ఆసుపత్రిలో పనిచేయాలి. వీరిని ఉపయోగించుకొని ఫార్మసీ విభాగ సిబ్బంది రోగులకు మందులు ఇచ్చేవారు. విద్యార్థులు శిక్షణకు రాని కాలంలో ఫార్మసిస్ట్ ఒక్కరే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రోహిల్ మాట్లాడుతూ ఫార్మసిస్ట్ ధృవపత్రాల పరిశీలన నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లారని, అనారోగ్యంతో సూపర్‌వైజర్ సెలవు తీసుకున్నారని చెప్పారు. అవగాహన ఉన్నశిక్షణ విద్యార్థులతో మందులు ఇప్పించామని పేర్కొన్నారు.